పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి నిమ్స్‌లో మృతి
ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన మొదటి సంవత్సరం పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్‌లో మృతి చెందింది. నిమ్స్ సూపరింటెండెంట్ విడుదల చేసిన ఒక బులెటిన్‌లో స్పెషలిస్ట్ వైద్యులతో కూడిన బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.

డాక్టర్ ప్రీతికి న్యాయం చేయాలంటూ నిమ్స్ ఆసుపత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరసనకు దిగారు. ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ కేఎంసీ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 22న రెండో సంవత్సరం పీజీ విద్యార్థి ఎండీ సైఫ్ వేధింపులు తట్టుకోలేక డాక్టర్ ప్రీతి హానికరమైన ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విలేఖరుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ మాట్లాడుతూ సైఫ్ 2022 నవంబర్ నుండి ప్రీతిని లక్ష్యంగా చేసుకున్నాడని చెప్పారు.

ప్రీతి మరణవార్త తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ₹ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. డాక్టర్ ప్రీతి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, “ప్రీతి ఆరోగ్యంగా తిరిగి రావాలని మేము ఆశించాము, కానీ ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తోంది. కాగా, మృతి చెందిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం సాయంత్రం నుంచి డాక్టర్ ప్రీతికి మద్దతుగా వివిధ గిరిజన సంఘాలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. ప్రీతి కుటుంబానికి ₹ 5 కోట్ల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఒక సభ్యునికి గ్రూప్-1 ఉద్యోగంతోపాటుగా, KMC ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.

