మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు నేడు
రెండు రాష్ట్రాల్లో పాగా కోసం బీజేపీ వ్యూహాలు
సత్తా చాటుతామంటున్న తృణముల్, కాంగ్రెస్
మేఘాలయలో సంగ్మా తనయుడు కీలక పాత్ర
మార్చి 2న రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా, ఎన్‌పిపితో విభేదించిన తరువాత, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఒక్కో రాష్ట్రంలో యాభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మేఘాలయలో, సోహియాంగ్ స్థానంలో అభ్యర్థి మరణించడంతో పోలింగ్ వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రత్యర్థి పోటీ నుండి వైదొలగడంతో నాగాలాండ్‌కు చెందిన అకులుటో ఎమ్మెల్యేగా గెలిచినట్టుగా నిర్ధారించారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మేఘాలయలో బహుముఖ పోటీ జరగనుంది, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, కాన్రాడ్ సంగ్మా NPP (నేషనల్ పీపుల్స్ పార్టీ), మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లు పోటీలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, పలువురు ఇతర కాంగ్రెస్ శాసనసభ్యుల ఫిరాయింపుల తర్వాత తృణమూల్ రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. గత సారి 21 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఓటరు బేస్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. 2018లో, బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది, కానీ NPPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అవినీతి ఆరోపణలతో సంగ్మా పార్టీతో విభేదాలు రావడంతో ఈసారి 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. సంగ్మా పార్టీ మణిపూర్‌లో గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా కొంత ఉనికిని కలిగి ఉండగా… నాగాలాండ్‌లోనూ సత్తా చాటాలనుకుంటోంది.

నాగాలాండ్‌లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో రాష్ట్రంలోని 60 సీట్లలో 12 సీట్లు గెలుచుకున్న బీజేపీ, NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ)తో కలిసి పోటీ చేస్తోంది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే ఖాతా తెరిచింది. ఏకైక ప్రత్యర్థి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో దాని అభ్యర్థి కజెటో కినిమి… అకులుటో అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అవసరమైతే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవచ్చని కాంగ్రెస్ చెబుతోంది. ఈసారి నాగాలాండ్‌లో నలుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండగా, మహిళా ఎమ్మెల్యేలు సైతం ఈసారి సత్తా చాటే అవకాశం ఉంది.

