Andhra PradeshHome Page SliderNews

బలమైన నేతలకు తెలుగుదేశం పార్టీ గాలం

• ఒక్కొక్క మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్న అధినేత చంద్రబాబు
• ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వ్యూహాలకు పదును
• తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుల నేపథ్యంలో ఆ పార్టీల వైపు నేతలు చూపు
• భవిష్యత్తు లక్ష్యంగా పలు జిల్లాల నేతల అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అనేక మంది నేతలు తమ భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే బలమైన పార్టీలో చేరి తమ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వివిధ పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పటిష్టమైన వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు తన వ్యూహాలుకు పదును పెడుతున్నారు. ఒకవైపు పార్టీ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్లను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పలు జిల్లాల్లో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారికి గాలం వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాపులలో బలమైన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ పై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. దీంతో గుంటూరు జిల్లాలో ఆ పార్టీ బలం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇలా పలు జిల్లాల్లో ఉన్న బలమైన నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వాతావరణం వివిధ పార్టీల నేతలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నేతలు తమ భవిష్యత్తుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగానే అనేకమంది నేతలు చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై పడింది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు వివిధ పార్టీల నేతలను ఆకర్షిస్తున్నాయి. ఇంకొక వైపు తెలుగుదేశం జనసేన పొత్తులపై దాదాపు క్లారిటీ వచ్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణకు మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఈ చేరిక దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో నేతలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తూ అనుచర వర్గాలతో ఆత్మీయ సమావేశాలు భేటీలు నిర్వహిస్తూ తుది నిర్ణయం తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా లభిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుండి ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అన్న భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ తీసుకొని పార్టీలో చేరేందుకు మెగ్గుచూపుతున్నారు. ఇంకొందరు నేతలు ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి రానున్న ఎన్నికల నాటికి ఎంతమంది ఏ ఏ పార్టీలలోకి మారుతారో చూడాల్సి ఉంది.