Telangana

బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌నే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

మీరు ఎంతటివారైనా సరే..మీకు ఆన్‌లైన్ మోసాల గురించి ఎంత అవగాహన ఉన్నాసరే మేము మిమ్మల్ని దర్జాగా చీట్ చేస్తామంటున్నారు సైబర్ మోసగాళ్ళు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవారు సహితం ఈ సైబర్ మోసగాళ్ళ వలలో చాలా సులువుగా చిక్కుకుంటున్నారు. ఈ విధంగానే ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ వీరి ఎత్తులకు చిత్తయ్యి 2,24,967/- పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహర్‌కు చెందిన సకల్‌దేవ్ సింగ్ పరకాలలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. హనుమకొండలోని సుబేదారిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు గత రెండురోజుల క్రితం ఓ మొబైల్ నెంబర్ నుంచి మీ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది..పాన్ కార్డ్ అప్‌డేట్ చేయండి అని మెసేజ్ వచ్చింది. అయితే ఆయన నిన్న ఉదయం ఆ మెసేజ్‌ను క్లిక్ చేసి అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించగా అది సబ్‌మిట్ కాలేదు. ఆ తర్వాత ఆయనకు మరో నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను చెప్పినట్లు చేయాలని సూచించగా సకల్ సింగ్ నేను బస్సులో ఉన్నాను..తర్వాత చేస్తాను అని చెప్పారు. బ్యాంకుకు చేరుకున్నాక సకల్ సింగ్ తనకు కాల్ చేసిన వ్యక్తికి తిరిగి కాల్ చేశారు. అప్పుడు అవతలి వ్యక్తి పాన్‌కార్డ్ అప్‌డేట్ చేయాలని చెప్పగా ఆయన కావడం లేదని ఆ వ్యక్తికి చెప్పారు. ఈ నేపథ్యంలో వేరే నెంబర్ నుంచి లింక్ పంపించగా ఆయన దాన్ని తెరిచిచూశారు. దీంతో ఆయన ఖాతాలో నుంచి మూడు విడతలుగా రూ.99,990/-, రూ.99,990/-,24,987/- రూపాయలు విత్‌డ్రా అయినట్టు ఆయనకు మెసేజ్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆయన నిన్న రాత్రి పరకాల పోలీసులకు  ఫిర్యాదు చేశారు.