బావ వచ్చేయ్ రాజకీయాల్లోకి… ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్కమ్…
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రతో ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయ్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీలో చాలా మంది కోరుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం తర్వాత, జూనియర్ రాజకీయాల గురించి దాదాపు మాట్లాడలేదు. నాడు టీడీపీకి జూనియర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న లోకేశ్… తిరుపతిలో హలో లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ యువత ప్రశ్నలకు జవాబిచ్చారు.

పవన్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ నేరుగా సమాధానం ఇవ్వకున్నా… వెరైటీ సమాధానం ఇచ్చారు. “రాష్ట్రంలో మార్పు రావాలి… అగ్రస్థానానికి వెళ్లాలని ఆశించేవారు వంద శాతం రావాలి. 2014లో పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు ఆయన మంచి మనసును చూశాను” అంటూ లోకేశ్ కితాబిచ్చారు. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ పగ్గాలు చేపట్టాలంటూ వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయ్. రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలనుకున్నవారు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని చెప్పడం ద్వారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్‌కు సిగ్నల్స్ ఇచ్చారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయినప్పుడు కూడా రాజకీయాలపై చర్చ జరిగిందన్న ప్రచారం ఉంది. అయితే ఆ విషయాలను అటు జూనియర్ ఎన్టీఆర్ గానీ, బీజేపీ నేతలు గానీ బయటకు చెప్పలేదు. స్వతహాగా జూనియర్ గురించి తెలిసినవారు, ఆయన హై యాంబిషస్ అని అంటారు. ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి, జూ.ఎన్టీఆర్ గురించి చెప్తూ… వామ్మో అనేవారు.. ఏదైనా పట్టుబడితే సాధించేవరకు వదలిపెట్టరన్నారు. సో.. బామ్మర్ది ఇచ్చిన సందేశాన్ని జూ. ఎన్టీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి!

