Andhra PradeshHome Page Slider

వివేక హత్య కేసులో రెండోసారి సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి శుక్రవారం రెండోసారి సిబిఐ ఎదుట హాజరుకానున్నారు ఈ కేసులో ఆయనను తొలిసారి గత నెల 28వ తేదీన ప్రశ్నించిన సిబిఐ సుదీర్ఘంగా విచారణ జరిపింది. అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా అప్పట్లో సిబిఐ కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని ఈనెల 23న,అవినాష్ రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సిబిఐ ఈనెల 18న నోటీసులు ఇచ్చింది. అయితే 23న హాజరు కాలేనని భాస్కర్ రెడ్డి సిబిఐ కు సమాచారం ఇచ్చారు. అవినాష్ రెడ్డి మాత్రం శుక్రవారం మరోసారి సిబిఐ ముందు హాజరుకానున్నారు. ఇప్పటిదాకా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుమానితుడి గానే ఉన్నారు. కానీ తాజాగా నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి వివేకా హత్యకు కుట్రపన్నారని సిబిఐ సూటిగా తెలిపింది. తండ్రి కొడుకులు సూత్రధారులని చెప్పకనే చెప్పింది. ఇందులో కూడా అవినాష్ రెడ్డి కాల్ డేటా నిందితుల ఫోన్లో లొకేషన్ల ఆధారంగా పలు కీలక వివరాలను ప్రస్తావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరు కానుండటంతో వైసీపీ వర్గాల్లో హైటెన్షన్ మొదలైంది.