ఢిల్లీకి ఏపీ బీజేపీ పంచాయితీ
•సోము వీర్రాజుపై తీవ్ర అసంతృప్తి
•ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్ తో అసమ్మతి నేతలు భేటీ
•పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దు
•రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తా
•ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు వ్యవహారశైలిపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు గురువారం ఢిల్లీ వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కేంద్రమంత్రి మురళీధరన్ తో సమావేశమై అధ్యక్షుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనతో రెండోసారి అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న బీజెపి రాష్ట్రంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఎదుగు బదుగు లేకపోవటానికి సోము వీర్రాజు వ్యవహార శైలి కారణమని వీరు చెప్పినట్లు తెలిసింది. ఇటీవలే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.రాజీనామా సమయంలో సోము వీర్రాజుపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం నచ్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కన్నా బాటలోనే పలువురు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

సోము వీర్రాజు తీరుపై విసుగెత్తిపోయిన పలువురు అసమ్మతి నేతలు ఢిల్లీ బాటపట్టారు. పలు జిల్లాల బీజేపీ మాజీ అధ్యక్షులు, వివిధ స్థాయుల్లో పార్టీకి పనిచేసిన నేతలు మురళీధరన్‌తో భేటీ అయ్యారు.రాష్ట్ర అధ్యక్షుడు సహా నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు కోరారు. సుమారు 30 మంది బీజేపీ నేతలు మురళీధరన్‌తో సమావేశం అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి,తుమ్మల అంజిబాబు, దారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, హనుమంతు, ఉదయ భాస్కర్ సహా 30 మంది నేతలు ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు.ఇకపై రాష్ట్ర పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ హామీ ఇచ్చారని అసమ్మతి నేతలు చెబుతున్నారు.
