వివేకా హత్య కుట్ర… అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డే పనేనా?
ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇతర నిందితులతో కలిసి వైఎస్ వివేకానందను సునీల్ హత్య చేశాడని సిబిఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. హత్యను ఉద్దేశపూర్వకంగా దాచాలని కుట్రపనినట్లు తెలిపింది. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. సునీల్ ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేశాడని సిబిఐ పేర్కొంది. హత్య రోజు రాత్రి సునీల్, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికెళ్లినట్లు తెలిపింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరం ఉందని ఎంపీ టికెట్ షర్మిలా లేదా విజయమ్మ లేదా తనకి ఇవ్వాలని వివేక కోరుకున్నారని తెలిపింది.

వివేకానంద రెడ్డి రాజకీయాలు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి నచ్చలేదని శివశంకర్ రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వివేక హత్యకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని సిబిఐ వెల్లడించింది. ఐదుగురుతో కలిసి అవినాష్ రెడ్డి హత్య స్థలానికి వెళ్లారని తెలిపింది. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని సిఐకి సమాచారం ఇచ్చారని పేర్కొంది. హత్యను ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోందని తెలిపింది. కుట్రలో భాగంగానే గుండెపోటు, విరోచనాలు కథ అల్లినట్లు కనిపిస్తోందని సిబిఐ తన పిటిషన్లో వెల్లడించింది. నిందితులు వివేకా హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టినట్లు సిబిఐ పిటిషన్లో పేర్కొంది.

వివేకానంద రెడ్డికి గుండెపోటు తీవ్ర రక్తపు వాంతుల అవటం వల్ల సహజంగా మరణించాడు అంటూ డ్రామా క్రియేట్ చేశారని సిబిఐ కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. వివేక హత్య జరిగిన రోజు నిందితులందరూ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని ఘటనాస్థలిలో సాక్షాలను చేరిపివేయడంలో కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, గజ్జల ఉమా శంకర్ రెడ్డి, సప్తగిరి ఉదయం ఐదు గంటల 20 నిమిషాలకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. వీరి ముగ్గురు ప్రమేయం బయటకు రాకుండా పకడ్బందీగా వ్యవహరించారని సిబిఐ పేర్కొంది. శివశంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివేకా చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి ,ఉమా శంకర్ రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పేర్కొంది.

వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. జనవరి 28న తొలిసారిగా సిబిఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డిని అధికారులు 6 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం సిబిఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి తనను మరోసారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని, వైఎస్ భాస్కర్ రెడ్డి 23వ తేదీన విచారణకు రావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు పంపించారు. అయితే వేరే కారణాల వల్ల తాను విచారణకు రాలేనని భాస్కర్ రెడ్డి సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. భాస్కర్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

