కర్నాటకలో ఇద్దరు మహిళా అధికారుల కోల్డ్ వార్
సోషల్ మీడియాలో వ్యక్తిగత చిత్రాలు
ఐపీఎస్ రూప వర్సెస్ ఐఏఎస్ సింధూరి
ప్రైవేటు వ్యవహారాలతో నారీమణుల భేరీ!
తలపట్టుకుంటున్న కర్నాటక సర్కారు
ఇద్దరు సీనియర్ మహిళా అధికారుల మధ్య వీధి పోరాటం కర్నాటక పాలనలో అతిపెద్ద కుదుపునకు కారణమవుతోంది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. ఇద్దరు అధికారులు మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేసుకోకుంటే… చర్యలు తప్పవని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించినా వారు వెనక్కి తగ్గడం లేదు. డి రూప మౌద్గిల్, IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారిణి, IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారి రోహిణి సింధూరి ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రోహిణి సింధూరి తన ఫోటోలను పురుష ఐఏఎస్ అధికారులకు పంపడం ద్వారా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారని రూప ఆరోపించారు. రూపా తన ఫేస్‌బుక్ పేజీలో చిత్రాలను పోస్ట్ చేయడంతో కాంట్రవర్శీ రాజుకుంది. సింధూరి 2021, 2022లో ముగ్గురు IAS అధికారులతో పంచుకున్నారని రూప ఆరోపించారు. అంతకుముందు రోజు సింధూరిపై రూపా అవినీతి ఆరోపణల సుదీర్ఘ జాబితాను విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మలకు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

మొత్తం వ్యవహారంపై స్పందించిన సింధూరి రూప తనపై తప్పుడు, వ్యక్తిగత దుష్ప్రచారానికి తెగబడ్డారని, ఆమెపై చర్యలు తీసుకుంటానని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ” సోషల్ మీడియా నుండి ఫోటోలను, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌షాట్‌లను సేకరించి, పరువు తీయాలని చూస్తోంది. ఈ చిత్రాలను కొంతమంది అధికారులకు పంపినట్లు ఆరోపిస్తున్నందున వారి పేర్లను బహిర్గతం చేయాలని కోరుతున్నా” అని సింధూరి చెప్పారు. రూప మానసిక స్థితి కూడా బాలేదన్నారు. రూపా మానసిక అనారోగ్యంతో సతమతమవుతుందన్నారు. అది చాలా పెద్ద సమస్య అని… మందులు, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసినప్పుడు, అలాంటి వాటితో ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో… వ్యక్తిగతంగా నష్టం కలిగిస్తున్నారన్నారు. మొత్తం వ్యవహారంపై కర్నాటక హోం మంత్రి, డీజీపీతో చర్చించానని, ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు. అయితే మొత్తం వ్యవహారంపై కర్నాటక హోం మంత్రి స్పందించారు. తాము మౌనంగా కూర్చోలేదని… మొత్తం వ్యవహారంపై ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వారిద్దరూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని… సాధారణ వ్యక్తులు కూడా వీధుల్లో ఇలా మాట్లాడరని… వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోవచ్చని… మీడియా ముందుకు రావడం సరికాదన్నారు.

రూప, కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోండగా… సింధూరి, హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. సింధూరి ఇటీవల ఓ రెస్టారెంట్‌లో జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యే సారా మహేష్‌తో కలిసి కూర్చున్న చిత్రాలు వైరల్ కావడంతో గొడవ మొదలైంది. 2021లో మైసూరులో ఎమ్మెల్యే సింధూరిని నియమించినప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ అనేక బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిని ఎందుకు కలుస్తారని రూప ప్రశ్నించగా… ఇద్దరూ డీల్ కోసం కూర్చున్నారన్నారు. ఆ ఆరోపణలను సింధూరి కొట్టిపారేశారు. ఇద్దరి మధ్య విభేదాలతో కర్నాటకలో అగ్గిరాజుకుంటోందగి. ముఖ్యమంత్రి బొమ్మై దీనిపై స్పందిస్తూ… “వ్యక్తిగత విషయం” అని అన్నారు. ఐతే పరిస్థితి ముదిరిపాకన పడటంతో తాను కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా కన్పిస్తోంది.

