Andhra PradeshHome Page Slider

సినిమాను ప్రేమించి.. శ్వాసించిన తారకరత్న

• 23 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన తారకరత్న
• జగన్, కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి సంతాపం
• హైదరాబాద్ కు పార్థివ దేహం
• శోకసంద్రంలో నందమూరి అభిమానులు

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలలో 23 రోజులుగా చికిత్స పొందుతు శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్ట్‌ తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలోని పలు అవయవాలు పని చేయకుండా పోయాయి. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది. ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


కాగా, 23 రోజుల క్రితం నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. బావమరిది యాత్రకు తన మద్దతు తెలిపారు. పాదయాత్రలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో నడుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనకు రాత్రి వరకు చికిత్స అందించారు. రాత్రి అక్కడినుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకెళ్లారు. 23 రోజులుగా అక్కడే చికిత్స తీసుకున్నారు. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆదివారం పార్దివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ నగర్ శివార్లలోని మోకీలులో ఉన్న ఆయన స్వగృగానికి తరలించారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద ప్రజల అభిమానుల సందర్శనార్థం ఉంచి సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహిస్తారు. తారకరత్న మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తదితరులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


ఇక, తారకరత్న ఎన్టీఆర్‌ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్న ఎన్టీఆర్ ఐదో సంతానం మోహన్ కృష్ణ ఏకైక కుమారుడు. ఫిబ్రవరి 22 1983లో హైదరాబాదులో ఆయన జన్మించారు. తండ్రి మోహన్ కృష్ణ సినిమా ఛాయాగ్రహకుడు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు ఆయన కెమెరామన్‌గా వ్యవహరించేవారు. చిన్నతనం నుండి సినిమా వాతావరణంలో పెరిగిన తారకరత్న తను కూడా సినిమా నటుడు కావాలనుకున్నారు. సినీ నటుల కుటుంబం కావడంతో ప్రోత్సాహం లభించింది. ఇలా మొదటిగా ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’తో ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. అమరావతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతుర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే, మధ్యలో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు. 2022లో ‘9 అవర్స్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.