National

విదేశీ ఉన్నత విద్యపై భారతీయులకు పెరుగుతున్న మక్కువ

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యువత విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నరు. అయితే ఇది భారతదేశంలో ఓ ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మన దేశంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్ధుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కాగా గత 6 సంవత్సరాలలో ఉన్నత విద్య కోసం మన దేశాన్ని విడిచి వెళ్లిన వారి   సంఖ్య 30 లక్షలకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీని కోసం 2017 నుంచి 2022 వరకు 30 లక్షల మందికి పైగా విద్యార్ధులు మన దేశాన్ని విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. 2017లో 4,54,000, 2018లో 5,17,000, 2019లో 5,86,000, 2020లో 2,59,000, 2021లో 4,40,000, 2022లో 7,50,000 మంది విద్యార్ధులు చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తాజాగా లోక్‌సభకు నివేదిక సమర్పించింది. అయితే దీనిలో కరోనా సమయంలో విదేశాలకు వెళ్లిన వారి సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. కరోనా అనంతరం విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య కొంత మేర పెరిగినట్లు తెలుస్తోంది.