స్మార్ట్ సిటీలు మాత్రమే కాదు… స్మార్ట్ విలేజ్‌లు కావాలి
ఏప్రిల్ 1 నుంచి 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకు-నితిన్ గడ్కరీ వెల్లడి
ఇకపై ఇథనాల్, మిథనాల్, బయో-సిఎన్జి, బయో-ఎల్ఎన్జి వాహనాలు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు
వ్యవసాయరంగాన్ని ఆధునీకరిస్తే దేశంలో యువతకు భారీగా ఉద్యోగాలు
15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తున్నామని… వాటి స్థానంలో కొత్త వాహనాలు రానున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇథనాల్, మిథనాల్, బయో-సిఎన్జి, బయో-ఎల్ఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ అన్నారు. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తొమ్మిది లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేయడానికి ఆమోదించాం, కాలుష్యాన్ని కలిగించని బస్సులు, కార్లు రోడ్డెక్కుతాయన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని మంత్రి తెలిపారు.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలి నోటిఫికేషన్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులతో సహా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాతవి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడతాయి. దేశ రక్షణ కోసం, శాంతిభద్రతల నిర్వహణ, అంతర్గత భద్రత కోసం కార్యాచరణ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రత్యేక ప్రయోజన వాహనాలకు నియమం వర్తించదని నోటిఫికేషన్లో పేర్కొంది.

“అటువంటి వాహనాల పారవేయడం, వాహనం ప్రారంభ రిజిస్ట్రేషన్ తేదీ నుండి 15 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, మోటారు వాహనాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ద్వారా నిర్ధారించాలన్నారు. యూనియన్ బడ్జెట్ 2021-22లో ప్రకటించబడిన ఈ పాలసీ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ పరీక్షలను అందిస్తుంది. ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చే కొత్త విధానం ప్రకారం, పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వాహనాలపై రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాలు రోడ్డు పన్నుపై 25 శాతం వరకు పన్ను రాయితీని అందిస్తాయన్నారు.

ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో 150 కిలోమీటర్లలోపు కనీసం ఒక ఆటోమొబైల్ స్క్రాపింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ముందస్తు ఆలోచనలతో దేశం మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడంలో సహాయపడుతుందని… ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రవాణా రంగాన్ని తక్షణమే డీకార్బనైజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఎలక్ట్రిక్ మోడ్‌లో మరిన్ని బస్సులను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు, ఇది ఎక్కువ మంది ప్రజలను ప్రజా రవాణా వైపు ఆకర్షిస్తుందని… వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేస్తోందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు చైనాలో 8 నుండి 10 శాతం, యూరోపియన్ దేశాలలో 12 శాతం, యుఎస్‌లో 12 శాతం మరియు భారతదేశంలో 14-16 శాతం ఉన్నాయని గడ్కరీ తెలిపారు. భారతదేశ లాజిస్టిక్స్ ధరను సింగిల్ డిజిట్‌కు తీసుకురావడమే లక్ష్యమన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 12 శాతం మాత్రమేనని… వ్యవసాయం, గ్రామీణ, గిరిజన భారతదేశంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల సహకారాన్ని 12 శాతం నుండి 24 శాతానికి పెంచగలిగితే, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. స్మార్ట్ సిటీలు మాత్రమే కాకుండా స్మార్ట్ విలేజ్లను కూడా చేస్తాయన్నారు.

