Andhra PradeshHome Page Slider

ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు?

1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రెసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులతో మమ అన్నట్టుగా ఎంపిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది. 1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామ సమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతమని బసవతారకo అన్నారు. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసారు.

1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30 లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆసమయంలోనే తన పార్టీ పేరు ” తెలుగుదేశంగా ” నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు. దానికి “చైతన్యరథం” అని నామరణం చేశారు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి. ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప… శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. ఎన్టీఆర్ మూడు సార్లు ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించారు. తొలుత జనవరి 9, 1983-16 ఆగస్టు 1984 వరకు, 16 సెప్టెంబర్ 1984 నుంచి 2 డిసెంబర్ 1989 వరకు తిరిగి మూడోసారి 12 డిసెంబర్ 1994 నుంచి 1 సెప్టెంబర్ 1995 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.