Andhra PradeshHome Page Slider

ఎన్టీఆర్ మూవీ ప్రొఫైల్

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు, ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. దీంతో మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్… తర్వాత రోజుల్లో నిర్మాత అయ్యాడు.

1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు. 1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లోఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది.

1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్టు ప్రొడక్షన్స్” పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు.1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1991లో విడుదలైంది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు. ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.