Home Page SliderNational

కన్ను మూసిన మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్

మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ గురువారం రాత్రి కన్నుమూశారు. జేడీయూ పార్టీ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆయన నివాసంలోనే కుప్పకూలి కన్పించారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువచ్చారని, అప్పటికే ప్రాణాలు పోయాయని, గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ అసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2003లో జేడీయూకి తొలి జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుండి 2016 వరకూ దాదాపు 13 ఏళ్లపాటు ఆపదవిలో కొనసాగారు. ఆయన ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రాజ్యసభ సభ్యత్వాన్ని, పార్టీలో పదవులను కోల్పోయారు.

అయితే 2018లో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీని సొంతంగా ఏర్పాటు చేసుకుని, 2020లో దానిని రాష్ట్రీయ జనతాదళ్‌లో విలీనం చేశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు.