Home Page SliderInternational

 బ్రిటన్‌లో ప్రిన్స్ హ్యారీ బుక్‌కు భారీ డిమాండ్

రాజకుటుంబానికి  సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎంతగానో  ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు కలిగిన బ్రిటన్ రాజకుటుంబం విషయంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ స్వయంగా రాసిన“స్పేర్” బుక్ బ్రిటన్‌లో భారీ డిమాండ్ పలుకుతోంది.

ఈ బుక్‌ను సోమవారం అర్దరాత్రి నుంచి మార్కెట్‌లో విడుదల చేయగా ఇప్పటికే 4 లక్షల కాపీల వరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.  ఇప్పటికీ ఈ బుక్‌ను కొనేందుకు  ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరారు. దీంతో యూకేలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా కొనుగోలు చేయబడ్డ నాన్-ఫిక్షన్ బుక్‌గా ఇది సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే ఈ బుక్ హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మెట్‌లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం వాస్తవ ధర 28 పౌండ్లు ఉండగా ..మొదటి రోజు చాలా దుకాణాలు సగం ధరకే విక్రయించినట్లు సమాచారం. కాగా అమెజాన్‌లో  దీని ధర 14 పౌండ్లకే అందుబాటులో ఉంది. బ్రిటన్‌లో సాధారణంగా హ్యారీ పోటర్ లాంటి ఫిక్షనల్ పుస్తకానికి తొలిరోజు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే మొట్టమొదటి సారి ఓ నాన్-ఫిక్షనల్ పుస్తకానికి భారీ స్థాయిలో గిరాకీ లభించిందని విక్రయదారులు చెబుతున్నారు.