సినిమా వాళ్లకే అన్‌స్టాపబుల్ మూవీ చూపించిన ఏపీ పోలీసులు
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నటసింహం బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులో నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈమధ్యకాలంలో తెలుగుదేశం నేత చంద్రబాబు సభలలో జరిగిన తొక్కిసలాటలు, ప్రాణనష్టం కారణంగా ఏపీ పోలీసులు సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈసినిమా హీరో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి.

ఈ వేడుకకు ఒంగోలులోని బీఎంఆర్ వెంచర్స్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం కోసం శ్రేయాస్ మీడియా అధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్దఎత్తున అభిమానులు, నటీనటులు ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఈ వేడుకను నిర్వహించాలని అభిమానులు ఆశించారు. మొదటిగా ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ఒంగోలు ఎస్పీని కలిసి చివరకు అర్జున్స్ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన 17 ఎకరాల స్థలంలో నిర్వహించడానికి ఒప్పించారు. కానీ పార్కింగ్, బారికేడ్లు, బందోబస్తు అంశాలలో అనేక ఆంక్షలతో మెలికలు పెడుతున్నారు పోలీసులు. చివరకు 15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని, అనుమతించిన ప్రేక్షకులకు మించి ఎవరూ రాకూడదని, పాసులు జారీచేయాలని, పోలీస్ స్టాంపింగ్ కూడా తప్పనిసరి అని ఆదేశించారు. బారికేడ్లు, వాలంటీర్లను, బౌన్సర్లను నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని షరతు పెట్టారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మాస్, ఫాక్షన్ నేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.