ప్లానింగ్ లోపమే టీడీపీకి శాపం
◆ వరుస అపశృతులతో టీడీపీ లో కలవరం
◆ గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో అపశృతి
◆ మళ్లీ తొక్కిసలాట ముగ్గురు మహిళల మృతి
◆ చనిపోయిన వారికి 27 లక్షల పరిహారం
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో వరుసగా చోటు చేసుకుంటున్న అపసృతులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. మూడు రోజుల క్రితం కందుకూరులో జరిగిన ఘటనలో 8 మంది పార్టీ కార్యకర్తలు మరణించగా తాజాగా నూతన సంవత్సరం రోజు ఆదివారం గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ సభలో జరిగిన తొక్కేసలాటలో మరో ముగ్గురు మృతి చెందటం ఆ పార్టీని ఉలికిపాటుకు గురిచేసింది. చంద్రబాబు సభలకు అనూహ్యస్పందన వస్తున్న తరుణంలో ఈ ఘటనలు ఆ పార్టీ నేతలను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కందుకూరు ఘటన మరువకముందే గుంటూరులో విషాదం చోటు చేసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహణ జరిగేలా చర్యలు చేపడతారు. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత నిచ్చే చంద్రబాబు తన కార్యక్రమాల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పక్కా కార్యాచరణను రూపొందించి దాని అమలు చేసే విధంగా నేతలకు తగిన మార్గదర్శకాలు ఇస్తారు చంద్రబాబు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘటన ఆనాడు పలు విమర్శలకు దారితీసింది. అప్పటినుంచి ఆయన తన ప్రతి పర్యటన కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో వరుస ఘటనలు చోటుచేసుకుని మొత్తం 11 మంది మృతి చెందటం ఆ పార్టీ నేతలను ఆవేదనకు గురిచేస్తుంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీకి విశిష్టమైన ఆదరణ లభిస్తున్న పరిస్థితుల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కార్యక్రమాల నిర్వహకుల వైఫల్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు ఘటనల్లో ఆయా ప్రాంతాల నేతలు సరైన ఏర్పాటు చేయకపోవడం అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న నాయకులు సరైన ప్లానింగ్ చేయకపోవడం వల్లే అది ఆ పార్టీకి శాపంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనలు అధికార పార్టీకి అస్త్రంగా మారాయి. అధికార పార్టీ నేతలు ఈ ఘటనను సాకుగా చూపి టీడీపీపై ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేస్తూ టీడీపీ ని ఇరుకులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జెడ్ కేటగిరి భద్రత లో ఉన్న చంద్రబాబు పర్యటనలు సభలను ఉన్నత అధికారులు ఎస్పి స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా బందోబస్తు జరగటం లేదని టీడీపీ ఆరోపిస్తుంది.

ఇదిలా ఉంటే వరుసగా తన సభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు. ఆయనే స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ అండగా నిలుస్తామన్న భరోసాను ఇస్తున్నారు. తాజాగా గుంటూరులో చనిపోయిన ముగ్గురు మహిళల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ తరపున 20 లక్షలు, పార్టీ తరఫున ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షలు ప్రకటించారు. ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలపై పార్టీ నేతలతో చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై సభలలో ఎలాంటి అపస్తృతులు తావు లేకుండా సమగ్రమైన కార్యాచరణ ప్లానింగ్ తో జరిగేలా చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్నారు. ఆ దిశగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

