Home Page SliderTelangana

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా…

బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరుగుతున్న మాజీ ఎంపీ
గులాబీ పార్టీ ఇచ్చిన గౌవరమేంటో చూశాం..
నాలుగేళ్లుగా జిల్లాలో ఏం జరుగుతుందో చూశామని వెల్లడి
అర్హత ఉన్నోళ్లంతా ఎన్నికల్లో పోటీ చేస్తారు!
కార్యకర్తలు కొరుకున్నట్టుగా ఎన్నికల్లో పోటీ
ఆత్మీయ పార్టీ సమావేశంలో పొంగులేటి క్లారిటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పొంగులేటి ఏం చేస్తారంటూ రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తన అనుచరులంతా ఎన్నికల్లో పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అర్హతే ప్రాతిపదికగా నేతలు పోటీ చేస్తారన్నారు. సమయం వచ్చినప్పుడు మీరు కొరుకున్నట్టుగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో దక్కిన గౌరవం ఏంటో చూశామన్నారు. నాలుగేళ్లలో జరిగిందేంటో తెలుసునన్నారు. ఐతే ఇది రాజకీయ వేదిక కాదంటూనే వచ్చే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు. మొత్తంగా ఇక గులాబీ పార్టీలో తాను ఉండబోవడం లేదన్న క్లారిటీ పొంగిలేటి ఇచ్చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి పొంగులేటి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన ధిక్కార స్వరం విన్పించిన ప్రతిసారీ గులాబీ పార్టీ నేతలు ఆయనను సముదాయిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయమని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన తేల్చి చెప్పారు. మొత్తంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి పొలిటికల్ హీట్‍‌కు కారణమవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న పొంగులేటి ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వాటిలో కేవలం మూడు స్థానాలు మాత్రమే జనరల్ ఉన్నాయి.

ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం స్థానాల్లోనే నేతలు ఎవరైనా పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించారు. పొంగులేటి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించినా.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి గెలిచినా, కేసీఆర్‌కు విధేయుడిగా వ్యవహరించినా టికెట్ కేటాయించకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీలో క్రమక్రమంగా ఎదుగుతున్న పొంగులేటిని కేసీఆర్ కుటుంబ రాజకీయాలు బలిచేశాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీగా అవకశమిస్తాని చెప్పినా.. ఆ పార్టీ హామీ నిలబెట్టుకోలేదు. దీంతో ఇప్పుడు పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తారా లేదంటే ఖమ్మం అసెంబ్లీ నుంచా, లేదంటే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారా అన్న సందిగ్ధత నెలకొంది.