Andhra PradeshHome Page Slider

ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయాలు

◆ ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్
◆ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేంద్రంతో సత్సంబంధాలు
◆ ఆ రెండు పార్టీలతో కలిసిన మీకు ప్రయోజనం లేదు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. ప్రధానితో సీఎం జగన్ 45 నిమిషాల పాటు బుధవారం సమావేశమయ్యారు. పాలనాపరమైన అంశాలతో పాటుగా రాజకీయ వ్యవహారాల పైన సీఎం చర్చించారు. ఏపీలో ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. రాజకీయ బంధాలు ఎలా ఉన్నా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను దక్కించుకునే పనిలో ఉన్నారు. ఇందులో ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయ అంశాలు చర్చించారని తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కాకుండా ఎప్పటికైనా టీడీపీ వంటి పార్టీలతో ప్రయోజనం శూన్యం అనే అంశాన్ని మీరు గమనించాలంటూ ప్రధాని మోడీకి జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో పొత్తు అంశం కీలకమని ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఇదే మంచి తరుణంగా భావించాలని ప్రధానికి సీఎం జగన్ సూచన చేశారని తెలుస్తోంది.

అదే క్రమంలో ఏపీలో తాము మరింత బలపడాలంటే బీజేపీతో నేరుగా పొత్తు లేకుండా ఆర్థికంగా ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని కోరారని సమాచారం. అలా చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో అధికారం దక్కించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం అన్నారని అంటున్నారు. ఏపీలో తాము ఇప్పటికే బలంగా ఉన్నామని పరోక్షంగా మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పరోక్షంగా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీలు పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాలను ఆమోదించి సత్వరమే నిధులు విడుదల చేయటం వంటి అంశాల్లో తమకు అండగా నిలవాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక్కడ తమతో మైత్రి బలపడితే తెలుగుదేశం బలహీనపడుతుందని తద్వారా ఏపీలో రెండో స్థానంలో బీజేపీ నిలిచే అవకాశం దక్కించుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతులు సత్వరమే ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు మిత్ర పక్షాలుగా కలిసి పోటీ చేయబోతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరగటం అందుకు తగ్గట్టుగానే ఆయా పార్టీల అధినేతలు పొత్తులకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని వివరిస్తూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ సంఘటనలు సమీకరణాలను సీఎం జగన్ మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే భేటీలో భాగంగా టీడీపీ జనసేన పోత్తులు వ్యవహారంపై చర్చించడంతోపాటు ఆ రెండు పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేయటం వల్ల చోటు చేసుకోబోయే పరిణామాలను కూడా ఈ సందర్భంగా మోడీతో చర్చించినట్లు తెలుస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచింది. రాజకీయ వర్గాల్లోను జగన్ ఢిల్లీ పర్యటన పై జోరుగా చర్చ మొదలైంది. ప్రత్యేకించి ప్రధానితో 45 నిమిషాల పైగా సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సీఎం జగన్ కూడా పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ వ్యవహారాలపై మోడీతో సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.