ఏం పనులు చేశామని ఓట్లు అడగాలి…
మరోసారి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాపూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాగడానికి నీళ్లు లేవు, ప్రాజెక్టులు కట్టమా? పనులు మొదలు పెట్టామా? నాలుగేళ్ల పాలనలో ఏం చేసామని ప్రజలకు దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలని ప్రశ్నించారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నామని వాపోయారు. కనీసం మట్టి కూడా వేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు. పెన్షన్లు ఇస్తే.. ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చిందన్నారు. ఇల్లు కడతామని లేఅవుట్ వేసినా ఇప్పటికీ కట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆనం విరుచుకుపడ్డారు.

