Home Page SliderNews AlertTelangana

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై జరుగుతున్న ఈడీ విచారణను నిలిపివేయాలని కోరుతూ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని రాబట్టేందుకే ఈడీ తనను విచారిస్తోందని ఆయన ఆరోపించారు. ఈడీ విచారణను నిలిపివేయాలని కోరారు. పార్టీ మారాలని పైలట్‌ రోహిత్‌ రెడ్డికి వంద కోట్ల ఆఫర్‌ ఇచ్చారు. ఆఫర్‌ మాత్రమే చేశారు కానీ డబ్బు ఇవ్వలేదు. క్యాష్‌ ట్రాన్స్‌జెక్షన్ జరగనందున ఈడీకి విచారణ పరిధి లేదు. ఈడీ ఈసీఐఆర్‌ మనీలాండరింగ్‌ చట్టానికి విరుద్ధం అని  రోహిత్‌ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  మరోవైపు మంగళవారం విచారణకు రావాలని రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చినా ఆయన గైర్హాజయ్యారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ నెల 30న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపినట్లు ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తన క్లయింటు రెండు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని రోహిత్‌ రెడ్డి తరఫు లాయర్‌ న్యాయమూర్తికి చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.