తెలంగా కాంగ్రెస్‌లో సెగలు.. పొగలు
పీసీసీ కమిటీల ప్రకటన తెలంగాణ కాంగ్రెస్‌లో తారాస్థాయిలో విభేదాలకు కారణమయ్యింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రేంసాగర్ రావుతోపాటు మరికొందరు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను కాదని.. వలస వచ్చిన నేతలకు పదవులు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమపై కోవర్టులంటూ ముద్ర వేసి.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలే చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మొత్తం వ్యవహారాలను పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామన్నారు.

పీసీసీ కమిటీల ఎంపిక తనకు సంబంధం లేకుండా జరిగిందన్నారు పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క. ఎవరైనా వచ్చి తమ పరిస్థేంటని అడిగినా… తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానన్నారు. తాజా ఎంపికపై బాధ కలిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ఇదే తంతు జరుగుతోందని… కుట్ర ఉందేమోననిపిస్తోందన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గతంలో తాను పీసీసీ చీఫ్‌గా పనిచేసిన రోజుల్లో ఇలాంటి పరిస్థతుల్లేవని.. ఇప్పుడు అన్నీ సమస్యల వస్తున్నాయన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ బాగు కోసం… సేవ్ కాంగ్రెస్ స్ఫూర్తితో పనిచేస్తామన్నారు. 33 జిల్లాల్లో 26 చోట్ల నియమించి 7 చోట్ల ఆపడం మంచిపద్దతి కాదన్నారు. కమిటీల్లో చాలా వరకు బయటి నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. పార్టీ పెద్దలను కలిసి తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తానన్నారు. మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అసలైనవారికి, వలస వచ్చిన వరికి మధ్య పోరాటం జరుగుతోందని… పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని కీలకపదవుల్లో తీసుకోవడం, మొదట్నంచి పార్టీ కోసం పనిచేసేవారిని పక్కనబెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. పార్టీలు మారడం అలవాటు లేదని… కాంగ్రెస్ పార్టీలోనే ఉండి.. కాంగ్రెస్ పార్టీలోనే చస్తామన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త వారి మధ్య ఆధిపత్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా కన్పిస్తోంది. కాంగ్రెస్‌లో మొదట్నుంచి ఉన్న నేతలకు, వలసదారులకు మధ్య పోరు అని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. పీసీసీ అధ్యక్షుడితో సమానమైన సీఎల్పీ నేత కమిటీల విషయంలో పాలుపంచుకోకుండా.. అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రతో కాంగ్రెస్‌ను నాశనం చేశారని ఆరోపించారు. బయటి నుంచి వచ్చిన వారిని ప్రశ్నించే స్థాయి లేనందునే ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్నవారి ఆశలను వమ్ము చేస్తున్నారన్నారు. అధికార పార్టీతో వ్యాపారం చేస్తూ నీతులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న నేతలంతా చాలా కాలంగా పార్టీలో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతానికి అందరూ కృషి చేశారు. తమను తాము కోవర్టులుగా ముద్ర వేస్తారా? అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.