Andhra PradeshHome Page SliderNews Alert

నా మరణదిన వేడుకలకు హాజరుకండి.. ఏపీలో వినూత్న ఆహ్వాన పత్రిక..

ఏపీలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహానికో, గృహ ప్రవేశానికో లేక పుట్టిన రోజు వేడుకలనో.. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు పంపించడం సాధారణమే! కానీ నా మరణ దిన వేడుకలు ఘనంగా చేసుకుంటున్నా మీరు తప్పకుండా రావాలని ఇన్విటేషన్‌ కార్డు అందుకుంటే ఎలా ఉంటుంది? ఇదేంటి ఆహ్వానం అనిపించకమానదు. ఈ వెరైటీ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత పాలేటి రామారావు… ఇలా తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించారు. “ మీ అందరికీ నా మరణ దిన వేడుకలను ఆహ్వానం పలుకుతున్నాను.. ఇన్నాళ్లూ చేసుకున్న పుట్టిన రోజుకు అర్థం లేదని, మరణ దినోత్సవ వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాను.. నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నాను.. నేను మరణించే సమయం ఇంకా 12 ఏళ్లు ఉంది. అందువల్ల ఈ రోజు నుంచే 12వ మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. కావున మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి.“ ఈ వెరైటీ ఆహ్వాన పత్రికను అభిమానులకు పంపించారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.