Andhra PradeshHome Page Slider

స్పీడ్ పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు

◆ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జోరుగా పర్యటనలు
◆ సంక్షేమ అస్త్రాలతో ఎన్నికలకు సన్నద్ధం
◆ జోరుగా ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం

ఏపీలో ఎన్నికల వేడి మొదలవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. ముందస్తు ఎన్నికల యోచనలో ఉన్న చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ శ్రేణులను ఆ దిశగా సన్నద్ధం చేస్తూ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఏడు నెలల క్రితం బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలో విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టిన టీడీపీ అధినేత తాజాగా మరో అస్తాన్ని సిద్ధం చేసి ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఈ నెల మూడో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి పేరిట మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలను 50 రోజుల్లో పార్టీ నేతలు కార్యకర్తలు కలిసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి దాని అమలుకు ఆదేశాలు ఇచ్చారు.

ఎన్నికల పోరుకు చంద్రబాబు రెడీ అయ్యారని 2019 ఎన్నికల్లో చేజార్చుకున్న అధికారాన్ని తిరిగి కైవసం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నారని ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు సాగిస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జిలతో భేటీ అవుతున్నారని ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని అంటున్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఎత్తివేస్తారనే వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బలమైన వ్యూహాలతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారని ప్రస్తుతం పాలక పక్షం అందిస్తున్న సంక్షేమానికి రెట్టింపు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేసే విధంగా ఆయా అంశాలపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆయన వారసుడు లోకేష్ తో పాటు ముఖ్య నేతలు కార్యకర్తలు అంత క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వరుస పర్యటనలు చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ భవిష్యత్తు హామీలను ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించిన చంద్రబాబు త్వరలోనే మరిన్ని జిల్లాల్లో పర్యటన షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో గెలుపొందాలనే లక్ష్యంతో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర పర్యటనలు చేస్తూనే మరోవైపు సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలతో నిత్యం మమేకమవుతున్నారు. మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీడీపీ అధినేత ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను కూడా ప్రకటించి మేనిఫెస్టో కూడా విడుదల చేసి పక్కా కార్యాచరణలతో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పక్షాన్ని గద్దెదించేందుకు చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.