Andhra PradeshNews

రాయలసీమకు మూడు తెచ్చారు…. వైసీపీ గర్జన సక్సెసైనట్టేనా?

‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. శ్రీబాగ్‌ ఒప్పంద ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్‌ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్‌, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ త‌దిత‌రులు మద్దతు తెలిపారు.  ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంకల్పించినందుకు జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.

కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి ఇష్టం ఉందా లేదా చంద్రబాబు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
శతాబ్దాల నుంచి కరువు కాటుకలను ఎదుర్కొన్న ప్రాంతం రాయలసీమని మంత్రి బుగ్గన అన్నారు. కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి ఇష్టం ఉందా లేదా చంద్రబాబుని సూటిగా ప్రశ్నించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో 7500 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు రాయలసీమకు వచ్చాయన్నారు. లా యూనివర్సిటీ రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావించారన్నారు బుగ్గన. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్టుగానే వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు.

14 ఏళ్ల సీఎం రాయలసీమకు ఏం చేశారు? – మంత్రి పెద్దిరెడ్డి
రాయలసీమ ప్రాంతంలో నుంచి వచ్చిన ముఖ్యమంత్రులతో పాటు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఒక్క హైదరాబాద్ తప్ప ఇంకా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి వికేంద్రీకరణ అనే సిద్ధాంతాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహగా పరిగణించాలని ప్రజలను పెద్దిరెడ్డి కోరారు.

వెనుకబాటుకి న్యాయ రాజధానితోనే న్యాయం: జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి
కర్నూలును ఏపీకి న్యాయ రాజధానిగా చేయాలనే నిర్ణయం ఇప్పటికి అత్యంత అవసరం. పదే పదే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా పోయిందన్నారు జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్. ఒకప్పుడు సంపన్న ప్రాంతంగా పేరు గాంచిన ప్రాంతం ఇప్పుడు వెనుకబడిపోయిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ వంటి రంగాలులో గత ప్రభుత్వలు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు పెరిగాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ ముగింపు పలికేందుకు న్యాయ రాజధానిని ఇక్కడే నిర్మించడం సముచితమన్నారు జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి.

వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారన్నారన్నారు జేఏసీ నేతలు. ‘సీమ’ 1937 పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉందని గుర్తు చేశారు. 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారన్నారు. ఈ ఒప్పందంపై నమ్మకంతోనే ఆంధ్రరాష్ట్ర సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారన్నారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారన్నారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని… కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడ్డాయన్నారు. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదుకు తరలించేశారని… శ్రీ బాగ్‌ ఒప్పందం అటకెక్కిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీబాగ్‌ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే ఉందని… రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్‌ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు.