హెచ్‌సీయూలో ఉద్రిక్తత
థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడన్న వార్త గుప్పుమనడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కీచక ప్రొఫెసర్ రవిరంజన్‌ను విధుల నుంచి తొలగించాలంటూ హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై యూనివర్సిటీ వీసీ స్పందించాలని.. వర్సిటీ అడ్మిన్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవిరంజన్‌పై గతంలోనూ మూడు కేసులున్నాయని.. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం రవిరంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కారులో ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం..
హిందీ బేసిక్స్ నేర్పిస్తానని నమ్మించిన ప్రొఫెసర్ రవిరంజన్.. థాయ్‌లాండ్ విద్యార్థినిని శుక్రవారం రాత్రి 8 గంటలకు కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో మద్యం తాగించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ప్రతిఘటించిన విద్యార్థినిని కొట్టాడు. తర్వాత ఆమెను తన కారులోనే తీసుకొచ్చి యూనివర్సిటీ గేటు వద్ద దించేసి వెళ్లిపోయాడు.

