డబ్బులు పంచితే గొప్పనా.. ఉపాధి, సంక్షేమ పథకాలు కావాలి..
ప్రజలకు డబ్బులు పంచుతూ తాను గొప్పగా పాలిస్తున్నానని సీఎం కేసీఆర్ అంటున్నారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ‘డబ్బులు పంచితే గొప్పనా.. ప్రజలకు ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి’ అని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే ఇతరులపై నెట్టేసే వైఖరి సీఎం కేసీఆర్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిది కాదని కేసీఆర్కు ఈటల హితవు పలికారు.

కేంద్రం పన్నుల్లో 14 శాతం రాష్ట్రాలకే..
అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సీఎం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఈటల విమర్శించారు. నిజానికి.. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో 14 శాతం రాష్ట్రాలకే పంచుతోందని.. అయినా కేంద్ర ప్రభుత్వంపై తాము బతకడం లేదంటూ.. కేంద్రమే తమపై ఆధారపడి బతుకుతోందని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటు అని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. దమ్ముంటే తెచ్చిన అప్పులు, ఖర్చు, కేటాయింపుల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా రాష్ట్రాలకు కేంద్రం ఒక పద్ధతి ప్రకారమే నిధులు కేటాయిస్తుందని వివరించారు.

