డిసెంబర్ నుంచి యాసంగి రైతుబంధు
ఏటా యాసంగికి ఇచ్చే రైతు బంధును డిసెంబర్‌లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వడం ప్రారంభించిన దగ్గర్నుంచి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందని, 1.46 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయన్నారు. 65 లక్షల రైతు కుటుంబాలకు రైతుబంధు, 1.48 కోట్ల ఎకరాలకు రైతుబంధు అందజేస్తామని చెప్పారు. దేశంలోనే సాగుకు పూర్తి సహకారం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు నిరంజన్ రెడ్డి. త్వరలోనే రుణమాఫీ కూడా చేస్తామన్నారు. దేశంలోనే సాగు ఉత్పత్తుల్లో తెలంగాణ మేటిగా ఉందన్నారు మంత్రి. కేంద్రం ధాన్యం కొనకున్నా రాష్ట్రం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్టుగా 24 గంటల నిరంతర విద్యుత్ గుజరాత్‌లో ఎందుకివ్వరని ఆయన బీజేపీని నిలదీశారు. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా సాగు ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందా అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండాలో మంత్రి పువ్వాడతో కలిసి ఆయన 3 గిడ్డంగులను ప్రారంభించారు. 20 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ గిడ్డంగుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలను నిల్వ ఉంచుతామని మంత్రి తెలిపారు.