నంద్యాలలో కృష్ణ కారుపై రాళ్ల దాడి..!
షాద్ నగర్ లో నటి జమున పై రాళ్లదాడి
ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య పోటాపోటీ
సూపర్ స్టార్ కృష్ణ.. ఎన్టీఆర్ మధ్య సినిమా రంగంలోనూ.. రాజకీయ రంగంలోనూ నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోటీ ఉండేది. అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో రచ్చ జరిగేది. 1983లో జరిగిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ కృష్ణ, నటి జమున అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ, నటి జమునపై వేరువేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఎన్.టి.రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విజయ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు నాదెండ్ల భాస్కరరావును కృష్ణ అభినందిస్తూ ఫుల్‌పేజీ ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటన కృష్ణ, ఎన్టీఆర్‌ల మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది.

రాజీవ్ గాంధీతో పరిచయం.. కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ
ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు కొనసాగాయి. కాగా.. 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కృష్ణ కలిశారు. ఎన్టీఆర్‌కు దీటైన ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తారని కాంగ్రెస్ నాయకులు భావించారు. 1984లో కృష్ణ ఫ్యామిలీతో వెళ్లి రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ కృష్ణ పలు సినిమాలు చేశారు.

కృష్ణ కంటికి గాయం..
నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీ రామారావు మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల సభలకు జనం పెద్దఎత్తున వచ్చేవారు. ఎన్టీరామారావును విమర్శిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేది. అయితే.. నంద్యాల సభలో కృష్ణ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. సభ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కృష్ణ కారుపై కొంత మంది రాళ్లతో దాడి చేశారు. దీంతో కృష్ణ కంటికి చిన్న గాయం అవడంతో ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.

రామోజీరావుతో విభేదాలు..
అప్పట్లో ఈనాడు అధినేత రామోజీరావు టీడీపీకి బహిరంగంగానే మద్దతు ఇచ్చేవారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత రోజు కృష్ణ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెటి.. తనపై దాడికి టీడీపీ.. ఈనాడు బాధ్యత వహించాలని ఆరోపించారు. ఈనాడు విలేకర్లకు కళ్లు, చెవులు పనిచేయడం లేదన్నారు. తన సభకు లక్షలాది జనం హాజరైతే కేవలం 1500 మందే హాజరయ్యారని రాశారని విమర్శించారు. దీంతో ఈనాడు మర్నాడే మొదటి పేజీలో కృష్ణ విమర్శలను, ఆరోపణలను ప్రచురించింది. ఓ వివరణ ఇస్తూ ఖండించింది కూడా. అప్పటి నుంచి కృష్ణ సినిమాల కవరేజీ ఈనాడులో ఉండేది కాదు. ఇక ఆ తర్వాతి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, రామోజీరావులు కలిసిపోయారు.

జమున కారుపైనా రాళ్ల దాడి..
ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ వెంటే నటి జమున కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఆమె కూడా అనేక గ్రామాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి పాలమూరు జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గంలో అప్పటి ఎన్నికల్లో డాక్టర్ పి.శంకర్రావు తరఫున ప్రచారం చేయడానికి నటి జమున వచ్చారు. ముందుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. తర్వాత షాద్ క్లబ్ వద్ద సభలో పాల్గొన్నారు. అయితే.. ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరుగుతున్న వార్ ఎఫెక్ట్ జమున పైనా పడింది. షాద్‌నగర్‌లో ఎన్టీఆర్ అభిమానులు జమున కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. మరోవైపు నంద్యాలలో కృష్ణపై రాళ్లదాడి చేయగా ఆయన కంటికి గాయం అయింది. ఇక్కడ మాత్రం జమునను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రక్షించుకున్నారు. నాడు ఈ తతంగానికి ప్రత్యక్ష సాక్షి అయిన సీనియర్ నేత నాగిళ్ల గోపాల్ గుప్తా.. జమునపై జరిగిన రాళ్ల దాడి సంఘటనను చెబుతుంటారు. దాడి జరిగిన సమయంలో తాను ప్రతిఘటించినట్లు గోపాల్ గుప్త చెప్పుకొచ్చారు.