NewsTelangana

ఆదాయంలో ‘రూ.కోటి’ దాటిన యాదాద్రి ఆలయం

యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చరిత్రలోనే రికార్డు ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం కలిసి రావడంతో యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. సెలవు దినం కావడంతో ఒక్క రోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000.. వీఐపీ దర్శనం టికెట్ల ద్వారా రూ.22,62,000.. వ్రతాల ద్వారా రూ.13,44,000.. కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000.. బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 ఆదాయం సమకూరిందని చెప్పారు. యాదాద్రి చరిత్రలో కోటి రూపాయల ఆదాయం రావడం ఇదే తొలిసారి. తెలంగాణ తిరుపతిగా భావిస్తూ యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన తర్వాత భక్తుల రాక పెరిగింది.

కేసీఆర్‌ బంగారం విరాళం..

ఆదివారం 40 వేల మందికి పైగా భక్తులతో యాదాద్రి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో అనేక రకాల ‘ఆర్జిత సేవ’ల్లో పాల్గొన్నారు. 9వ తేదీన 13 రోజుల హుండీ వసూళ్లలో రూ.1.2 కోట్లు వచ్చాయి. మరోవైపు లక్ష్మీనరసింహ స్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు సీఎం కేసీఆర్‌ సెప్టెంబరు 30వ తేదీన ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ఆలయ ఈవో గీతకు అందజేశారు. ఆ రోజు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు మొక్కులు కూడా చెల్లించుకున్నారు.