ఆర్థిక మాంద్యం.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం
అగ్రదేశం అమెరికా ఆర్థిక మాంద్యంతో విలవిల్లాడుతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు లాభాల్లేక దిక్కులు చూస్తున్నాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్ సహా పలు యూరోపియన్ దేశాలు కూడా మాంద్యం ఉచ్చులో చిక్కుకున్నాయి. పలు దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త నియామకాలను ఎప్పుడో నిలిపివేశాయి. ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను సైతం రద్దు చేశాయి. భారత ప్రముఖ ఐటీ కంపెనీలకు అమెరికా, ఐరోపా దేశాల నుంచే ఎక్కువ మంది క్లయింట్లు ఉన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు 80 శాతం ఆదాయం ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల నుంచే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మన ఐటీ కంపెనీలకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

ఉద్యోగులపై భారత ఐటీ దిగ్గజాల వేటు..
దేశంలోనే టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ జూలై-సెప్టెంబరు మధ్య కాలంలో నియామకాలను భారీగా తగ్గించుకున్నాయి. ఆ సంస్థలు తమ ఖర్చుల్లో 55-65 శాతం మేర ఉద్యోగుల వేతనాలకే వెచ్చిస్తున్నాయి. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటుపైనే ఫోకస్ పెట్టాయి. దేశంలోని 5 ప్రముఖ ఐటీ సంస్థలు సేల్స్, సపోర్ట్ స్టాఫ్‌ను భారీగా తగ్గించుకున్నాయి. ఆదాయం అందించని స్టాఫ్‌ను తగ్గించుకుంటూ కొత్త నియామకాలను సైతం నిలిపివేశాయి. టీసీఎస్ తమ ఉద్యోగులకు లే ఆఫ్ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను నిలిపివేశాయి. నకిలీ పత్రాలు చూపి కంపెనీలో చేరారన్న నెపంతో అసెంచర్ ఇండియా యూనిట్ వేల మందిపై వేటు వేసింది. ఒకేసారి రెండు కంపెనీలకు పని చేస్తున్నారంటూ విప్రో 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మాత్రం మూన్‌లైటింగ్ తప్పేమీ కాదన్నాయి.

ఇతర కంపెనీలూ ఉద్యోగులపై వేటు..
మరోవైపు ఎడ్‌టెక్ (ఆన్‌లైన్‌లో విద్యాబోధన) కంపెనీలు కూడా ఉద్యోగాల్లో కోత విధించాయి. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ క్లాసులకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో బైజూస్ వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో ఆన్‌లైన్ క్లాసులు, లెర్నింగ్ యాప్స్‌కు డిమాండ్ తగ్గింది. దీంతో గతేడాది 4,500 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్న బైజూస్ 2,500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అన్ అకాడమీ 1,350 మందిని, వేదాంతు 724 మందిని, లిడో లెర్నింగ్ 500 మందిని వదిలించుకున్నాయి. బ్లింకిట్ ఏకంగా 1600 మంది ఉద్యోగులను, కార్స్ 24 కంపెనీ 600, ఉడాన్ 530, ఓలా 500, ఎంఫైన్ 500, ట్రెలో 300, మీషో 300, ఫ్రంట్ రోలో 275, ఫార్‌ఐ 250, రూపీక్ 230, లిడో 200 మంది ఉద్యోగులను తొలగించాయి.

మాంద్యం ప్రభావం రెండేళ్లు..
ఆర్థిక మాంద్యం ప్రారంభ దశలోనే ఆయా సంస్థలు ఇంత మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం 6 నెలల నుంచి ఏడాదిలోపు పీక్ స్టేజ్‌కు వెళ్తుందని.. రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లోని కంపెనీల సీఈవోలతో పాటు ప్రపంచ దేశాల్లోని పలు కంపెనీల సీఈవోలు కూడా ఇదే అభిప్రాయం చెబుతున్నారు. కొత్త నియామకాలను నిలిపివేయడంతో పాటు ఉద్యోగాల్లో కోత విధించడం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 
							 
							