NewsTelangana

బండి సంజయ్‌ అరెస్టు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మునుగోడుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతంలోకి స్థానికేతరులకు అనుమతి లేదన్న నెపంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో భారీ భద్రత నడుమ ఆయనను బీజేపీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఆయనను అక్కడే నిర్బంధించినట్లు తెలుస్తోంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద అదుపులోకి..

ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే ఉన్నారని.. ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో బండి సంజయ్‌ గురువారం అర్ధరాత్రి మునుగోడుకు బయల్దేరారు. స్థానికేతరులకు అనుమతి లేదంటూ తొలుత మలక్‌పేట్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో బండి సంజయ్‌ కారును మాత్రమే అనుమతించారు. వనస్థలిపురం వద్ద మళ్లీ పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తల అండతో వెళ్లిపోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చేరుకోగానే భారీ స్థాయిలో వచ్చిన పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

మునుగోడులోనే టీఆర్‌ఎస్‌ స్థానికేతరులు..

మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మునుగోడులోనే ఉండి ప్రజలను భయపెడుతున్నారని.. ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ఎన్నికల నియమావళికి లోబడే నిరసన తెలిపేందుకు వెళ్తున్న తనను మాత్రం అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. మునుగోడులో ఉన్న స్థానికేతర టీఆర్‌ఎస్‌ నాయకులను వదిలేసి బండి సంజయ్‌ను అరెస్టు చేయడాన్ని బీజేపీ నాయకులు తప్పుబట్టారు.