NewsTelangana

ఇక ‘క్రాస్‌ ఓటింగ్‌’ భయం

మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. క్లైమాక్స్‌కు చేరుకున్న ఎన్నికల ఘట్టంలో గురువారం పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో అన్ని పార్టీలకు ‘క్రాస్‌ ఓటింగ్‌’ భయం పట్టుకుంది. ప్రచారం ముగిసింది. డబ్బులు, తాయిళాల పంపకం ప్రారంభమైంది. వీటి వరదలో తమ పార్టీ ఓటర్లు కొట్టుకొని పోకుండా అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. మనవాళ్లు అనుకునే వారు ఇతర పార్టీల వైపు మళ్లకుండా పోలింగ్‌ పూర్తయ్యే వరకు తమ కార్యకర్తల ద్వార కన్నేసి ఉంచుతున్నాయి.

నల్లగొండలోనే మకాం..

పోలింగ్‌ పూర్తయ్యే వరకూ పార్టీ నేతలంతా నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఉండాలని.. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ మునుగోడు ఓటర్లతో ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నాయకులకు అప్పగించిన ప్రాంతంలోని ఓటర్లకు ఫోన్లు చేసి పోలింగ్‌ ముగిసే వరకూ ఫాలో చేయాలని సూచించారు. మునుగోడు ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో స్వయంగా కేసీఆర్‌ బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్షనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి.. చివరి నిమిషంలో క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తమకు అప్పగించిన పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ రోజు ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

తమ ఓటర్లతో టచ్‌లో..

బీజేపీ నాయకులు కూడా నల్లగొండ నుంచే సమన్వయం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నేతృత్వంలో నాయకులంతా బృందాలుగా ఏర్పడి మునుగోడులోని అన్ని మండలాల్లో గల బీజేపీ కార్యకర్తల సహకారంతో ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లతో నేరుగా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పక్కాగా వేస్తారనుకుంటున్న ఓటర్లు టీఆర్‌ఎస్‌ నాయకుల తాయిళాలు, డబ్బుల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా సాంప్రదాయంగా పడే ఓటర్లు, మహిళా ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు.