NewsTelangana

హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్ర… నెక్లెస్‌ రోడ్డులో కార్నర్‌ మీటింగ్‌

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రం నేడు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. రాహుల్‌ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేడు శంషాబాద్‌ నుండి భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్‌ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

సాయంత్రం 4 గంటలకు పురానాపూల్‌ వద్ద ప్రారంభమయ్యే పాదయాత్ర హుస్సేనీ ఆలం, లాడ్‌ బజార్‌ మీదుగా 4.30 గంటలకు చార్మినార్‌కు చేరుకుంటుంది. అక్కడ రాజీవ్‌ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్థూపంపై జాతీయ పతాకాన్ని రాహుల్‌ గాంధీ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర గుల్జార్‌ హౌస్‌, మదీనా, నయాపూల్‌, ఉస్మాన్‌ గంజ్‌, మొజంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, నాంపల్లి, పబ్లిక్‌ గార్డెన్‌, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ మీదుగా 7గంటలకు నెక్లెస్‌ రోడ్డుకు చేరుకుంటుంది.

కార్నర్‌ మీటింగ్‌లో ఖర్గే

రాత్రి 7 గంటలకు నెక్లెస్‌ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాహుల్‌ గాంధీతో పాటు జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. ఇక పాదయాత్ర జరిగే మూడు కిలోమీటర్ల రేడియస్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ రోజు నుండి రెండు రోజుల పాటు భారత్‌ జోడో యాత్ర నగరంలో కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. నేడు ఆరాంఘర్‌, బహదూర్‌ పుర, చార్మినార్‌, ఆఫ్జల్‌గంజ్‌, మొజంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, నెక్లెస్‌ రోడ్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. సాయంత్రం 6 గంటల వరకు యాత్ర జరిగే ప్రాంతాలలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. రేపు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేసే ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగునున్నాయి.