రేపు యాదాద్రికి వెళ్తున్నా.. కేసీఆర్ రావాలి..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్న వివాదం ఫాంహౌస్ నుంచి యాదాద్రికి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను యాదగిరి గుట్ట నరసింహ స్వామి వద్దకు వెళ్తున్నానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేసి చెబుతానని.. ఈ డ్రామాతో సంబంధం లేదని సీఎం కేసీఆర్ అనుకుంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కోసం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఎదురు చూస్తానని.. కేసీఆర్ రాకుంటే ఈ కుట్ర వెనుక టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నట్లు ప్రజలు అర్ధం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకునేందుకే కేసీఆర్ ఈ స్కెచ్ వేసినట్లు తెలిపారు.

ఒక ఉప ఎన్నికలో విజయం కోసం ఇంత తతంగం అవసరమా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫాంహౌస్‌కు వచ్చింది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే.. ఫిర్యాదు చేసింది కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే.. దీన్ని ఎవరైనా నమ్ముతారా..? అని నిలదీశారు. నందకుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్, ఫామ్‌హౌస్ సీసీ టీవీ ఫుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వారం రోజుల్లో ప్రగతి భవన్‌కు ఎవరు వచ్చి వెళ్లారు..? ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఎవరు కలిశారు..? పోలీసు కమిషనర్‌తో పాటు నలుగురు ఎమ్మెల్యేల, స్వామీజీల ఫోన్ కాల్‌లిస్టును బయట పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ ల్యాండ్ ఫోన్ కాల్‌డేటాను కూడా బయట పెట్టాలన్నారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని.. కోర్టుకు కూడా వెళ్తామని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

