Andhra Pradesh

రోజాకు సీఎం జగన్ క్లాస్ ?

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు సీఎం వైఎస్ జగన్ సున్నితంగా క్లాస్ పీకినట్లు విశ్వసనీయ సమాచారం బుధవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో రోజా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య నియోజకవర్గంలో జరుగుతున్న వర్గ పోరు పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. రోజా సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి తన ప్రమేయం లేకుండానే కనీసం మంత్రిని అని విలువ ఇవ్వకుండా ఈ నెల 16వ తేదీన రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలను ప్రారంభించడంతో తనను బలహీన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోజా ఆడియో వాయిస్ ను నియోజకవర్గ కార్యకర్తలకు పంపడం, అది సోషల్ మీడియాలో హల్చల్ చేయటంతో సీఎం జగన్ దీనిపై కొంత అసహనం వ్యక్తం చేస్తూ రోజాను కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే పరిష్కరించుకోవటానికి వేదికలు ఉన్నాయని త్వరలోనే చక్రపాణి రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పినట్టు తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు నాయకులతో సమన్వయంగా వ్యవహరించి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని రోజాకు జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.