NationalNews

హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ కీలక నిర్ణయం

సిమ్లా మనసర్కార్

బీజేపీ పార్టీ ఈసారి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికలలో కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఓ చాయ్ వాలాకు అవకాశం కల్పించడానికి నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనపెట్టింది. సిమ్లా అర్భన్ శాసనసభ స్థానం నుండి బీజేపీ తరపున అభ్యర్థిగా సంజయ్ సూద్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రాష్ట్రమంత్రి సురేశ్ భరద్వాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఇదే స్థానం నుండి నాలుగుసార్లు గెలుపొందారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తనకు టికెట్ దొరకడంతో సంజయ్ చాలా ఆనందించారు. ఇలాంటి కీలక స్థానం నుండి తనను అభ్యర్థిగా నిలబెట్టడం చాలా సంతోషంగా ఉందని ,తనలాంటి చిన్న కార్యకర్తకు ఇది చాలా పెద్ద గౌరవం అనీ అన్నారు. తాను 1980 నుండి బీజేపీతో కలిసి పనిచేస్తున్నానని, 1991 నుండి చాయ్ అమ్ముతున్నానని, అంతకు పూర్వం బస్టాండ్‌లో వార్తాపత్రికలు విక్రయించేవాడినని, అలా సంపాదించిన డబ్బుతోనే చదువుకున్నానన్నారు. ఆ సమయంలోనే విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో పనిచేసే అవకాశం లభించిందన్నారు సంజయ్. గతంలో బీజేపీ సిమ్లా మండల్ అర్భన్‌కు జనరల్ సెక్రటరీగా కూడా పని చేశారు. తర్వాత పార్టీ మీడియా ఇన్ ఛార్జ్‌గానూ పనిచేశారు. ఆ సమయంలోనే స్థానిక ఎన్నికలలో కూడా పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి బీజేపీ సిమ్లా యూనిట్‌కు అధ్యక్షునిగా ఉన్నారు సంజయ్ సూద్. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న మంత్రి సురేశ్ భరద్వాజ్‌ను కాసుంప్టి స్థానం నుంచి నిలబెడుతోంది.