Telangana

మునుగోడు ఎన్నికల ప్రచారంలో హల్చల్ చేస్తున్న కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, ఆ రాజకీయ పార్టీల వల్ల మునుగోడు అభివృద్ధి సాధ్యం కాదని. తనకు ఓటేసి గెలిపిస్తే… మునుగోడుని అభివృద్ధి చేస్తానంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అక్కడ ఉన్న వందల మంది పిల్లలను తాను చదివిస్తానని, మండలానికి ఒక ఆసుపత్రిని, కాలేజీని కట్టిస్తానని కేఏ పాల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇక రైతుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన కేఏ పాల్ మునుగోడులో ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మంది యువతకు ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడులోని ఓ చిన్నహోటల్ లో ‌దోశలు వేసి అక్కడ ఉన్న ఓటర్ల ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాదు హోటల్ నిర్వహిస్తున్న దంపతుల ఇద్దరు పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు తానే చదివిస్తానని కేఏ పాల్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.