ఫైర్ క్రాకర్స్ కాలిస్తే జైలుశిక్ష, జరిమానా
ఢిల్లీ: మనసర్కార్
ఢిల్లీ సర్కారు దీపావళి పండుగపై కీలక నిర్ణయం తీసుకుంది. నిశ్శబ్ధ దీపావళిని జరుపుకోవాలని కొన్ని రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పుడు బాణాసంచా కాల్చితే శిక్షలు కూడా తప్పవని హెచ్చరించింది. దీపావళి అంటేనే దీపాలు, బాణాసంచాలతో మార్మోగి పోవలసిందే. కానీ వాతావరణ కాలుష్యం ఈ సీజన్లో ఢిల్లీలో ఎక్కువగా ఉండడం వల్ల, ఈ నిబంధనలు తప్పడం లేదు. బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినా, కాల్చినా 200 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలుశిక్షను కూడా విధిస్తామని పేర్కొంది. క్రయవిక్రయాలు జరపడం నేరంగా పరిగణింపబడుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. బాణాసంచా నిలువచేస్తే 5000 రూపాయల వరకూ జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక సెక్షన్ 9 బీ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష కూడా విధిస్తామని తెలిపారు. ఈ నిషేధాన్ని అమలు జరిగేలా చూడడానికి 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్యనివారణ చర్యలలో భాగంగా సెప్టెంబరు నుండే ఫైర్ క్రాకర్స్ పై తయారీ, విక్రయం, కాల్చడం అన్నింటిపై నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. దీపావళికి ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. తమ పర్యావరణ మినిష్టర్ వీడియోను అప్ ట్విటర్లో పోస్టు చేసింది.