ఫుట్‌బాల్ చరిత్రలో పెనువిషాదం నింపిన స్టేడియం కూల్చివేత
ఫుట్‌బాల్ చరిత్రలోనే కాక, క్రీడా చరిత్రలోను తీరని శోకాన్ని మిగిల్చిన ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియాన్ని త్వరలోనే నేలమట్టం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటించారు. దాదాపు 133 మందిని బలిగొన్న ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని తెలిపారు. దీనికి తమ వంతు సాయం అందిస్తామని ఫిఫా అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఈ దేశంలో అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జగరనుంది. ఈ నేపథ్యంలో ఫిఫా అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటి అయ్యారు.

అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని కంజుర్‌హన్ ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజును ఇన్‌ఫాంటినో ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో ఒక చీకటి రోజుగా పరిగణిస్తున్నామని తెలిపారు. కొత్త స్టేడియాన్ని క్రీడాకారులు,ప్రేక్షకులకు భద్రత కల్పించే విధంగా అత్యాధునిక ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. ఇండోనేషియాలో ఫుట్‌బాల్‌ను సంస్కరిస్తాం. మ్యాచుల నిర్వహణ విషయంలో మార్పులు తీసుకువస్తామని ఇన్‌ఫాంటినో స్పష్టం చేశారు. ఈ మేరకు ఫిఫా, ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఇన్‌ఫాంటినో వెల్లడించారు. ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై ఫిఫా,ఇండోనేషియా ప్రభుత్వం,ఆసియా ప్రతినిథులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు దేశంలోని అన్ని ఫుట్‌బాల్ స్టేడియాలను మూసివేయాలని అధ్యక్షుడు జోకో విడోడో ఆదేశించారు.