కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
◆ రెండున్నర దశాబ్దాలు అనంతరం జరుగుతున్న ఎన్నికలు
◆ ఓటు వేయనున్న తొమ్మిది వేల మందికి పైగా ప్రతినిధులు
◆ ముఖాముఖిగా తలపడుతున్న మల్లికార్జున్ ఖర్గే ,శశిధరూర్
భారతదేశంలో ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకీ అధ్యక్ష ఎన్నిక నేడు జరగనుంది. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోటీలో ఎనిమిది పదులు వయసు కలిగిన మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ లు ముఖాముఖి తలపడుతున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఎన్నికల నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సెంటర్ ఎలక్షన్ అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఒక్కో బూత్ లో గరిష్టంగా 200 మందికి మించకుండా మొత్తం 36 ప్రాంతాల్లో 67 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. తొమ్మిది వేల మందికి పైగా ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

భారత్ జోడోయాత్రలో భాగంగా రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన వెంట ఉన్నందున ప్రత్యేకంగా ఒక బూత్ ను జోడో యాత్ర క్యాంపులో ఏర్పాటు చేశారు. మిగతా బూత్ లను ఆయా రాష్ట్రాల పిసిసి కార్యాలయాల్లో, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పార్టీ నియమించింది. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి ఉదయం 8:30 కి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని ఏఐసీసీ తెలిపింది.

పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్ తో కూడిన గుర్తింపు కార్డులను ప్రతినిధులు తీసుకురావాలని సూచించింది. అలాగే తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటి అంకెను రాసి ఓటు వేయాలని పేర్కొంది. అయితే ఒకటి అంకె బదులుగా టిక్ మార్క్ ను అనుమతించాలని బరిలో ఉన్న శశిధరూర్ వర్గం డిమాండ్ చేసింది. నేడు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధ్యక్షులుగా ఎవరు ఎన్నిక అవుతారనేది ఆ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.