నేల విడిచి సాము చేస్తున్న కమ్యూనిస్టులు
పార్లమెంటులో అడుగంటుతున్న వామపక్షాల బలం
కమ్యూనిస్టులే ఏకమయ్యేందుకు ఇష్టపడటం లేదు
లౌకిక, వామపక్షాలను ఏకం చేస్తామంటున్నారు
బీజేపీని గద్దె దించుతామంటూ గంభీర వచనాలు
విజయవాడ, అక్టోబరు 15(మనసర్కార్): మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ సీపీఐ నేతలు విజయవాడలో గంభీర వచనాలు పలికారు. భారత దేశ భవిష్యత్తు ఎర్ర జెండాతోనే ముడిపడి ఉందంటూ సొంత భజన చేసుకున్నారు. ప్రజాస్వామ్య లౌకిక, వామపక్ష శక్తులను ఏకం చేసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడతామని.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా ఢంకా బజాయించారు. నిజానికి.. దేశంలో లౌకిక, వామపక్ష శక్తులను ఏకం చేసే శక్తి సీపీఐకి ఉందా..? పార్లమెంటులో వాళ్లకు ఉన్న బలమెంత..? వాళ్ల మాట వినే వాళ్లు ఎవరు..?

కమ్యూనిస్టుల మాట వినేదెవరు..?
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అని పోరాడిన వారు కమ్యూనిస్టులు.. ఆ సమయంలోనే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ సీపీఐ. తర్వాత క్రమంగా చీలికలు, పేలికలై దేశంలో నామమాత్రంగా మిగిలిపోయారు. కమ్యూనిస్టు నాయకులే సైద్ధాంతికం పేరుతో ఒకరినోకరు కలహించుకొని.. తమ వేలితో తమ కంట్లోనే పొడుచుకున్నారు. ఇప్పుడు పార్లమెంటులో సీపీఎంకు 3, సీపీఐకి 2, ఫార్వర్డ్ బ్లాక్‌కు ఒక ఎంపీ సీటు మాత్రమే ఉన్నాయి. వీళ్లకంటే ఒక్క రాష్ట్రానికే పరిమితమైన ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఎంపీ సీట్లు కలిగి ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కమ్యూనిస్టులు తోక పార్టీలుగానే మిగిలిపోయారు. ఈ తరుణంలో లౌకిక శక్తులు వీళ్ల మాట వింటారనడమే విడ్డూరంగా ఉంది.

ఏకమైన హిందుత్వ శక్తులు..
బీజేపీ వెంట ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే కాదు.. హిందుత్వ శక్తులన్నీ ఉన్నాయి. వాళ్లంతా ఒక్క మాటపై నిలబడుతూ.. ప్రజలందరినీ ఏకం చేస్తున్నారు. దేశ అభివృద్ధే ఏకైక అజెండాగా.. దేశంలోనూ.. ఇతర దేశాల్లోనూ భారత్ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకుడి నుంచి గల్లీ నాయకుడి దాక.. అందరి లక్ష్యం పేద ప్రజలను ఉద్ధరించడమే అనే విషయాన్ని ప్రజలు గ్రహించారు. అందుకే.. బీజేపీ దినదినాభివృద్ధి చెందుతోంది. ఎన్ని శక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఎందరు కుతంత్రాలు పన్నినా.. మోదీ-అమిత్ షా ద్వయం ఎత్తులకు చిత్తవుతున్నారని దేశ ప్రజలు చెప్పుకుంటున్నారు.

ముందు కమ్యూనిస్టులు ఏకం కావాలి..
కమ్యూనిస్టులు ముందు ఏకం కావాలని.. ఆ తర్వాతే లౌకిక పార్టీలను కలుపుకోవడం గురించి ఆలోచించాలని దేశ ప్రజలు ఎంతో కాలంగా అంటున్నారు. అయినా.. మా సిద్ధాంతాలు వేరు.. మేం కలిసేది లేదు.. అవసరమైతే పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ప్రజా పోరాటాలు మాత్రం ఎవరికి వారే చేసుకుంటామంటూ కమ్యూనిస్టులు రోజురోజుకూ ప్రజల నుంచి దూరం అవుతున్నారు. ఎర్ర జెండా చేతబట్టిన మీరే కలవడానికి ఇష్టపడకుంటే.. ఇతర లౌకిక పార్టీలు ఎలా కలుస్తాయని.. బీజేపీపై పోరాటం అనే మీ భూటకపు మాటలను ఎవరు నమ్ముతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కమ్యూనిస్టులు నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.