మును “గౌడ్” లదే కీలక ఓటు బ్యాంక్
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైన గెలవాలని ప్రధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఓటు బ్యాంకు వివరాలు సేకరిస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2.27 లక్షల మంది ఓటర్లు ఉండగా…బీసీలు అత్యధికంగా 1.50 లక్షల మంది ఉన్నారు. కులాలవారిగా ఓట్ల రిపోర్టును దగ్గర పెట్టుకున్న ప్రధాన పార్టీలు ఆయ కులాల అగ్రనాయకులను పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. ఈ అంశంలో టీఆర్ఎస్ ఇతర పార్టీల కన్నా కాస్త ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు 38 వేల మంది ఉండటంతో టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను రంగంలోకి దింపింది. ఆయనతో మునుగోడు ఉప ఎన్నికలో విస్తృత ప్రచారం చేయిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్, బాలగోని బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్కు మునుగోడులో మద్దతు ప్రకటించారు. అలాగే మునుగోడులో మున్నూరు కాపు సంఘం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దుతు ఇస్తున్నట్లు తెలిపింది. నియోజకవర్గంలో గొల్ల, కురుమ కులానికి చెందిన వారు 35వేల మంది ఉన్నారు. ఇక ముదిరాజ్‌లు 34 వేల మంది ఉండగా.. వీరి ఓట్లు తమవైపు పొందేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.