తాను పనిచేసే కాలేజీలోనే ఫ్రొఫెసర్‌గా మారిన అటెండర్
మనసుంటే మార్గముంటుంది అంటారు పెద్దలు. స్వయంకృషితో ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ లేదు. ఈ మాట బీహార్‌లోని భగల్‌పూర్ యూనివర్సిటీలో ప్యూన్‌గా పనిచేసే కమల్ కిశోర్ మండల్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏ యూనివర్సిటీలో అయితే ప్యూన్‌గా పనిచేస్తున్నాడో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సంపాదించాడు మండల్. ఆయన జీవితంలో చిన్ననాటి నుంచీ పేదరికం, కష్టాలే పలుకరించాయి. తల్లి అనారోగ్యం కూడా అందుకు తోడయ్యింది. అయినా సరే విజయం సాధించాలనే పట్టుదల ముందు అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఆయన తండ్రి ఇప్పటికీ భగల్ పూర్ ముండీచాక్ ప్రాంతంలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నారు. డిగ్రీ వరకూ కష్టపడి స్కారల్ షిప్‌ల మీద చదువు కొనసాగించినా, తర్వాత ఆయన చదువు సాగలేదు. 2003లో ముంగర్‌లో ఉండే అర్డీ అండ్ డీజీ కాలేజీలో కుటుంబపోషణ కోసం నైట్ వాచ్‌మెన్‌గా చేరారు. అయితే నెల తర్వాత అదృష్టదేవత కరుణించి డిప్యుటేషన్ మీద తిల్కా మాంజీ భగల్ పూర్ యూనివర్సిటీకి ప్యూన్‌గా వెళ్లారు. అక్కడే అతని జీవితం పెను మలుపు తిరిగింది.

అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను చూసిన ఆయనకు చదువుకోవాలనే బలమైన కోరిక కలిగింది. అక్కడి సంబంధిత విభాగానికి అర్జీ పెట్టుకోగానే, అనుమతి లభించింది. దీనితో ఉదయం కాలేజీ, మధ్యాహ్నం బంట్రోతు పని, రాత్రుళ్లు చదువుతూ రేయింబవళ్లు కష్టపడ్డాడు. అలా 2009లో పీజీ ,2017నాటికి పీహెచ్ డీ పూర్తిచేశారు. ఆపై లెక్చరర్ పోస్టు కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (NET) పూర్తి చేసి, 2020లో ఇంటర్యూకి హాజరయ్యారు. మే 2022 ఫలితాలు వెలువడవడంతో ఏ యూనివర్సిటీలోనైతే బంట్రోతుగా పని చేశాడో అదే యూనివర్సిటీకి అక్టోబరు 12వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు.
పేదరికం తన చదువుకు ఆటంకం కల్పించలేకపోయిందని, తన చదువుకు సహకరించిన ఫ్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని వినయంగా బదులిచ్చాడు కమల్ కిశోర్ మండల్.