కృష్ణానదిపై వేల కోట్ల వ్యయంతో రెండతస్తుల ఐకానిక్ వంతెన
కృష్ణానదిపై దేశంలోనే మొట్టమొదటి సారిగా రెండతస్తుల కేబుల్, ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కృష్ణమ్మ అందాలను పాదచారులు కూడా వీక్షించేలా వంతెనలో కాలిబాటను గాజుతో ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ వంతెన రూపురేఖల ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ణాల మధ్య కృష్ణానదిపై దాదాపు 1082 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఈ వంతెనలో పైలాన్,లైటింగ్ వ్యవస్థలు గోపురం ఆకారంలో ఉంటాయని గడ్కరీ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల మధ్య సోమశిల వద్ద ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది.

గత 15 సంవత్సరాలుగా ఈవంతెన కల సాకారం కాలేదు. తెలంగాణాలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణానదిలో పడవ ప్రయాణమే మార్గం. లేదా రహదారి మార్గంలో 100 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. 2007లో కృష్ణలో పడవ మునిగి 61 మంది జలసమాధి కావడంతో ఆ ప్రదేశంలో వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు బలంగా కోరుతున్నారు. ఈ వంతెన పూర్తయితే హైదరాబాద్ నుండి కడప, చిత్తూరు, తిరుపతి వైపు వెళ్లేవారికి కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్- తిరుపతి మధ్య దూరం దాదాపు 80 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ వంతెనకు అనుసంధానంగా కల్వకుర్తి-నాగర్ కర్నూల్- కొల్లాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు -నంద్యాల మార్గాన్ని కలుపుతారు. వీటిని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. ఇక త్వరలో ఈ సోమశిల ప్రదేశం పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ వంతెన టూరిస్టులను బాగా ఆకర్షిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

