Andhra PradeshNews

సీమను స్వీప్ చేస్తేనే మళ్లీ అధికారం

◆ మళ్లీ అధికారంలోకి రావడం ఎలా?
◆ రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయాల్సిందే…!
◆ ఇప్పటికే సీమపై జగన్ స్పెషల్ ఫోకస్
◆ 52 నియోజకవర్గాల్లో గెలుపు ప్రణాళికలు
◆ టీడీపీ బలంగా ఉన్న స్థానాలపై ఫోకస్

2024 అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ 175 నియోజకవర్గాలు టార్గెట్ గా అడగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురేయాలని ఆయన చెబుతున్నారు. టార్గెట్ చాలా పెద్దదే అయిన దానికి తగినట్లుగానే నాయకులకు దిశా నిర్దేశం చేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో జగన్ అనుకున్నట్లు 175 నియోజకవర్గాల్లో గెలిచిన గెలవకపోయినా అధికారాన్ని కోల్పోకుండా ఉండాలంటే పరిమితమైన సీట్లు సాధించాల్సి ఉన్న నేపథ్యంలో జగన్ ప్రత్యేకించి రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలోని జిల్లాలో ఉన్న 52 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని అందుకోసం ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని ఆ ప్రాంత నాయకులకు జగన్ సూచించారు. ఈ మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంత మంది ముఖ్యనేతలతో కూడా ఈ విషయంపై సీఎం జగన్ సమావేశమయ్యారు.

2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ 30 స్థానాల్లో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 49 స్థానాల్లో విజయం సాధించింది. 2014 నుండి 2019 వరకు ఐదేళ్ల కాలంలోనే రాయలసీమ జిల్లాల్లో వైసీపీ బలాన్ని పెంచుకుంటోం. దాని ఫలితంగా 52 కు గాను 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. అలానే వచ్చే ఎన్నికల్లో మిగిలిన మూడు స్థానాలను కూడా సొంతం చేసుకొని రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయాలని సీఎం జగన్ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాయలసీమలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా గడిచిన రెండు ఎన్నికల్లోను వైసీపీకే అనుకూల వాతావరణం కనిపించింది. కానీ ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలు మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ల లేకపోవడం వంటి కారణాలతో దాదాపుగా 25 నియోజకవర్గాల్లో వైసీపీ వెనుకబడిందని ఆయా నివేదికలు జగన్‌కు అందాయని పార్టీ వర్గాలంటున్నాయ్. ఆయా నియోజకవర్గాల్లో వెనకబడిపోతున్న నేతలను జగన్ హెచ్చరించి మరింత వేగంగా ప్రజల్లో తిరిగేలా దిశా నిర్దేశం చేస్తున్నారట.

రాయలసీమలోని నాలుగు జిల్లాల పరిధిలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత మేర బలం పుంజుకుంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో మరింత పట్టు సాధించాలని అందుకోసం అవసరమైన కార్యాచరణను ఇప్పటినుండే రూపొందించుకోవాలని జగన్ నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఈసారి ఎవరు పోటీలో ఉండబోతున్నారు, ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం బలపడింది, అక్కడ స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నదానిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల నేతలతో జగన్ సమాలోచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఇప్పటినుండే కష్టపడి పనిచేయాలని ప్రతి నిత్యం మంత్రులు, శాసనసభ్యులు ప్రజల్లోనే ఉండాలని జగన్ సూచిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రాయలసీమలోని చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలిచేలా జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టాలంటే వైసీపీకి రాయలసీమ ప్రాంతం చాలా కీలకం కానుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్ ముందుకు సాగుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి జగన్ అనుకున్నది సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.