గ్రూప్-1కి ఇలా సిద్ధమవ్వండి
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 92 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 2 వతేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 13 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబరు 18న జరగబోతోంది. మొయిన్స్ పరీక్ష మార్చి 2023లో జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రిలిమ్స్‌కు మెయిన్స్‌కు కేవలం మూడునెలలు మాత్రమే వ్యవధి ఉండడంతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ పరీక్షకు సిద్ధమవడానికి ఉపయోగపడే చిన్న చిన్న మెలకువలను పాటిస్తే వీటిలో ఉత్తీర్ణత సాధించడం అసాధ్యమేం కాదు.
ముందుగా ప్రిలిమ్స్ పేపర్ గురించి చూద్దాం. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 240. పేపర్ 1 సిలబస్‌లో భారతదేశ చరిత్ర, రాజ్యాంగం, అంతర్జాతీయ సంబంధాలు, ప్రాంతీయ, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు ఉంటాయి. చారిత్రక అంశాలకు సంబంధించి ప్రముఖ రాజవంశాలు మాత్రం చదివితే సరిపోతుంది. రాజ్యాంగానికి సంబంధించి కాస్త క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. భౌగోళిక అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం బాగా పరిశీలిస్తే సరిపోతుంది. ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే గత రెండు సంవత్సరాల బడ్జెట్ అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. బ్యాంకింగ్, ఎగుమతులు, దిగుమతులు, జనాభా, పేదరికం, నవరత్నాలు, సర్వేలు, వివిధ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు రావచ్చు. వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలి.

ఇక పేపర్2 లో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కరెంట్ అఫైర్స్. ఈ అంశాలలో స్కోరింగ్ సాధించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. బీటెక్ విద్యార్థులైతే సైకలాజికల్ ఎబిలిటీస్‌లో చాలా తేలికగా మార్కులు సాధించవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విభాగంలో ప్రతీరోజూ 2 గంటలు సాధన చేయాల్సి ఉంటుంది. ఇక సాధారణ డిగ్రీల విద్యార్థులు కాస్త ఎక్కువగా ఈ మెంటల్, సైకలాజికల్ ఎబిలిటీస్‌పై ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎన్ని గంటలు చదివామనేదే కాదు. ఎంత పనికివచ్చే విషయాలను చదివామనేదే ముఖ్యం. బాగా మెలకువలను పాటిస్తూ, ఒక ప్రణాళికతో సంసిద్ధమైతే మెయిన్స్‌కు అర్హత సాధించడం చాలా సులభం. మెయిన్స్‌లో రాత పరీక్షతో పాటు ఇంటర్యూకి కూడా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా చదివితే గ్రూప్స్ విజేత మీరే కావచ్చు.
తదితర వివరాలకు http://psc.ap.gov.in/ ను సందర్శించండి.

