తొలి రోజే పట్టుబడిన నోట్ల కట్టలు
మునుగోడు ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కోడ్ కూడా వెంటనే అమల్లోకి వచ్చింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వివిధ రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల కోడ్ అమలు కోసం 6 బృందాలు, సర్వే కోసం 6, ఫ్లయింగ్ స్క్వాడ్ కోసం 7, వీడియో సర్వే లైన్స్ కోసం 6 బృందాలు నిరంతరం నియోజక వర్గంలో నిఘా పెట్టాయి. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తొలి రోజే మునుగోడుమండలం గండపురి చెక్ పోస్టు వద్ద రూ.13 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండూరు మండలం భీమనపల్లికి చెందిన నరసింహ నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ప్లాట్ విక్రయించడంతో వచ్చిన డబ్బు అని పోలీసులకు ఆయన వివరణ ఇచ్చారు.

