NationalNews

బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే పార్టీలేవీ..?

కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితికి దేశమంతా ఆదరణ లభిస్తుందా..? ఆ పార్టీ కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుందా..? పొత్తు పెట్టుకునే పార్టీలేవీ..? విలీనమయ్యే పార్టీలేవీ..? తెలంగాణాకే పరిమితమైన కేసీఆర్‌ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందా..? ఎవరు అండగా నిలుస్తారు..?

జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలంటే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణాలో హ్యాట్రిక్‌ విజయం ఖాయమనే ధీమాతో కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా తమ వెంటే ఉన్నారని.. ఇక దేశ ప్రజల దృష్టిని తన వైపునకు మరల్చుకోవడమే మిగిలిందని తెలంగాణ సీఎం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం విషయం ఎలాగున్నా.. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ప్రభావం చూపాలంటే చాలా సమీకరణాలను అధిగమించాలి.

ఒక పార్టీ విలీనం.. మరో మూడు పార్టీలు లైన్‌లో..

బీఆర్‌ఎస్‌లో విలీనమయ్యేందుకు ఇప్పటికే తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ అనే చిన్న పార్టీ అంగీకరించింది. చిదంబరం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి(వీసీకే)’ అధినేత తొల్కప్పియన్‌ తిరుమవలవన్‌ హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసి పార్టీ విలీన ప్రతిపాదన చేశారు. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌లో విలీనమయ్యేందుకు ఓకే అన్నాయని కేసీఆర్‌ అనుయాయులు చెబుతున్నారు.

కలిసి పనిచేేసేందుకు కుమారస్వామి, అఖిలేష్‌, తేజస్వి సిద్ధం..

కర్ణాటకలో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్‌(ఎస్‌) అధినేత కుమారస్వామి కూడా కేసీఆర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసేందుకు ఓకే అన్నారు. అయితే.. విలీనానికి మాత్రం నో అంటున్నారు. యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ కూడా కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌కు సానుకూలంగానే స్పందించారు. అయితే.. ఆయా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

తొలుత దక్షిణాది రాష్ట్రాల్లో పాగా..

కాగా.. జాతీయ పార్టీతో తొలుత మహారాష్ట్ర, కర్ణాటకల్లో దృష్టి సారిస్తానని కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలో మూడేళ్ల వరకూ అసెంబ్లీ ఎన్నికలు లేవు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కానీ.. ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల గురించి కేసీఆర్‌ ప్రస్తావించలేదు. అంటే.. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటుందన్నమాట. ఈ ఏడాది ఆగస్టులో ప్రజాశక్తి డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింగ్‌ వాఘేలా తన పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తారో.. కలిసి పని చేసేందుకు మొగ్గు చూపుతారో చూడాలి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ పాలసీని అనుసరిస్తూ క్రమక్రమంగా ముందుకెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తొలుత దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించి.. అక్కడ బలోపేతమైన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా కోసం ప్రయత్నించాలనే ప్లాన్‌తో ఉన్నారు.